ఆ స్వతంత్ర స్వర్గసీమ నిర్మింపగ తరలి రమ్ము
లెమ్ము లెమ్ము లెమ్ము లెమ్ము లెమ్ము సోదరా || ఆ స్వతంత్ర ||
భీతి లేక మనిషి యెచట శిరము నెత్తి నిలుచునో
తనివితీర జనులకెల్ల జ్ఞానసుధలు దొరకునో
అడ్డుగోడలేని సమ సమాజ మెచట నుండునో
హృదంతరాళ జనితమౌ సత్యమెచట వరలునో || ఆ స్వతంత్ర ||
కర్మ పూర్ణ నిరత సిద్ధి ఉనికిపట్టు ఏదియో
ధర్మ పధము మీరకుండ కర్మ లెచట జరుగునో
ధైర్య స్థైర్య సద్గుణాలు మెలగు తావు ఏదియో
విమల శీల ఘన వికాస ప్రగతి కేది నిలయమో || ఆ స్వతంత్ర ||