భారతి భగవతి నా తల్లీ
నీ భాగ్యమె కోరుదు నిరతము తల్లి ||
హిమవన్నగమే నీ ధరహాసం
హిందూ సంద్రము నీ చరణవిలాసం
గంగా సింధు నీ కదలికలకు
శ్రీకరంబై పొంగిన చందం || భారతి ||
చతురాశ్రమములు నీ జీవన సూత్రం
చతుర్వేదములు నీ పావన గాత్రం
చతుర్ధామములు నీ హృది వీధిని
వినిపించినవి సమతానాదం || భారతి ||
బ్రాహ్మ్యము క్షాత్రము నీ కౌపోసన
బడయుటె వాని నీ నిజారాధన
నాదు సాధనే సార్ధక మందగా
అభయము నిమ్మా అంజలి గొనుమా || భారతి ||