కదలిరా కదలిరా నవ భారత యువశక్తి కదలిరా
కదలిరా కణకణము స్పందించే కోరికతో
కదలిరా అణువణువు అర్పించే హృదయంతో
నీ శక్తి అపూర్వం కొండలనే పిండి చేయు నీ శక్తి అనంతం
పుడమికి సౌందర్యమీవు వీచిన పురుషార్థమీవు
మనువుకి సంతానమీవు మానవొత్తముడనీవు || కదలిరా ||
ఉరకలెత్తు యువరక్తం నీది
శరావతి జలపాతపుటావేశం నీది
కాలగతిని హరియించిన సతి సుమతి నీ తల్లి
కార్తవీర్యు మదమణచిన పరశురాము అంశ నీవు || కదలిరా ||
నీ శక్తికి పరీక్ష ఈనాడు
నీ హృదిలో ప్రళయమ్మే దాగి వుంది చూడు
శత్రువు గుండెల్లొ నీవు సింహ స్వప్నమవ్వాలి
సాగవు మీ ఆటలని సవాల్ చేసి చాటాలి || కదలిరా ||
భరతమాత పిలుస్తోంది
కన్నీరే కడలి కాగ గద్గదమౌ కంఠంతో
హృదయము కరుగుట లేదా గుండెలు మండుట లేదా
అణువణువు అమ్మ కొరకు ఆక్రోశించుట లేదా || కదలిరా ||