ప్రయత్నమే స్వయత్నమై దైవమంచు సాధకా
ఇదే ధ్యాస పదే పదే మనసునందు నిలుపరా !!
1.ధ్యేయ మార్గమందునా - ధృవుని వోలే నుండుమా
సాధనా పథమ్ములో- సతతమ్ము నిలువుమా
ఆగకుండ ఆగకుండ - నడువు ముందు ముందుకు
ధ్యేయ దీప కాంతిలో - సాగి పొమ్ము ముందుకు !! ప్రయత్నమే!!
2. తోడు రాకపోయినా - నీడ లేకపోయినా
దారి చుట్టు చీకటి - దట్టముగా నిండినా
గట్టి గుండె బలముతో - పట్టు వదలి పెట్టకు
ధ్యేయ దీప కాంతిలో - సాగి పొమ్ము ముందుకు !! ప్రయత్నమే!!
3.మోహపాశములను త్రెంపి - స్వార్థమును జయింపుమా
ధ్యేయమందు ఐక్యమంది - ధీరుడవై సాగుమా
వెనుకకు అడుగేయకుండ - నడువు ముందు ముందుకు
ధ్యేయ దీప కాంతిలో - సాగి పొమ్ము ముందుకు !! ప్రయత్నమే!!
4. పర్వతాలు సాగరాలు - పెను తుఫానులడ్డినా
ప్రళయ ఝంఝలెన్ని లేచి - పైకి పైకి వచ్చినా
ఎదురు తిరిగి పైకి దూకి - కదలి పొమ్ము ముందుకు
ధ్యేయ దీప కాంతిలో - సాగి పొమ్ము ముందుకు !! ప్రయత్నమే!