రాముని మించిన వారెవరు
లోకములో లేరింకెవరు
బ్రోచేవారు ఇంకెవరు
రామునికి సరి రారెవరు
రామా రామా రఘురామ
జానకి వల్లభ జయ రామా!!
1.
నావను నడిపి నది దాటించిన
గుహుడి సేవలు అపురూపం
అయోధ్యలో రారాజుల ప్రక్కన గుహునికి గౌరవ స్థానం ఇచ్చిన
!!రాముని మించిన!!
2.గురుకులమ్ములో విద్యను పొందె అరుంధతిని తన తల్లిగ తలచి
శాపం పొందిన మాత అహల్యను ఓదార్చి,చైతన్యం నింపిన
!!రాముని మించిన!!
3.విల విల లాడే సీతను జూచే
రావణుని తన ముక్కుతో పొడిచే
ప్రాణమొసంగిన జటాయు పక్షికి
దహన క్రియలే శ్రద్దగ చేసిన
!!రాముని మించిన!!
4.భక్తితో శబరి ఇచ్చిన పళ్ళను ఆనందంతో ఆరగించెను
జై శ్రీరామని వానరులంటే
గుండెనిండుగ కొలువై ఉండెను
!!రాముని మించిన!!
5. లంకను గెలిచి, తిరిగిచ్చేసి విభీషణున్ని రాజుగ చేసి
వాలిని చంపి, రాజ్యం వద్దని
అంగదుడిని యువరాజుగ చేసిన
!!రాముని మించిన!!
6. సీతను అడవుల పంపెను గాని
ఎడబాటున తను విలపించేను
భార్యభర్తల ప్రేమెటువంటిదో లోకానికి చూపించెను రాముడు
!!రాముని మించిన!!
7. ఉత్తర దిశలో జన్మించె ,
దక్షిణ దిశలో పయనించె
భారతీయులం మనమంటూ
తరతమ భేదం తగదంటూ
!!రాముని మించిన!!